గురువు - శిష్యుడు - సాధనలు


5. గురువు - శిష్యుడు - సాధనలు

శ్లో||  ఓం ఈశ్వరో గురారాత్మేతి మూర్తి భేద విభాగినే |
       వ్యోమవత్‌ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః ||

గురువు : 
లఘువు కానివాడు. గురువు కంటె అధికులు లేరు. ఆయన ముందు అందరూ లఘువులే. నగురోరధికం నగురోరధికం నగురోరధికం.

శిష్యుడు : 
శాసించబడుటకు ఒప్పుదల అయినవాడు (పెద్దల చేత, గురువుల చేత)

శాస్త్రము : 
శాసిస్తూ, ఆచరించే వారిని తరింప చేయుటకు మార్గదర్శకమైనది. తాను బ్రహ్మ తత్త్వమైనది ఆవరింపబడినప్పుడు, తిరిగి తాను బ్రహ్మ తత్త్వమేనని జ్ఞాపకము చేయునది. పెద్దలకు ప్రత్యక్షమైనదే, ఆగమ ప్రమాణ రూపములో మార్గదర్శకమైనది శాస్త్రము. దీనిని అనుమాన ప్రమాణము చేసికొని, విచారణ చేత ప్రత్యక్షపరచుకొనవలసి యున్నది.

వృత్తి : 
ఒక ఆచార్యుడు ప్రతి ఒక్క పదమును ఎంతగా విపులీకరించగలడో అలా వివరించుటను వృత్తి అందురు. పదముల సముదాయమైన వాక్యార్ధ్థమును మరలా బాగుగా విపులీకరించుటను వాక్యవృత్తి అందురు.

వార్తికము : 
వాక్య వృత్తిని వ్యాఖ్యానించుచు, చర్చించుచు, సద్విమర్శ చేయుచు గురువు బోధించగా శిష్యుడు శ్రవణము చేసి నిర్ణయించుకొనుటను వార్తికము లేక వార్తీక నిర్ణయము అందురు.

ఉపదేశము : 
సమీప స్థానము, శ్రేష్ఠమైన స్థానము. శిష్యుడిని సద్వస్తువు సమీపమునకు గాని, ఆ సద్వస్తువును శిష్యుని హృదయ స్థానము వద్దకు  గాని గొనిపోవునట్లు గురువు చేయునది.

ఉపవాసము : ఆత్మ సన్నిధిలో వసించుట.

ఉపనయనము : 
గురువు శిష్యుడిని జ్ఞాన దృష్టికి సమీపముగా గొనిపోవునది. కర్మకాండగా దీక్షను ఇచ్చి శిష్యుని బ్రహ్మగా చరించే సాధన చేయించుట.

బ్రహ్మచారి : 
శరీరానుసారమైన జీవితమును బ్రహ్మ జ్ఞాన లక్ష్యములో జీవించుటగా అభ్యాసము చేయుట.

ఉపరతి : 
బ్రహ్మానందానుభవమును ఎవరు వ్యక్తపరచుకొనగలరో, వారికి అది ఉపరతి. తానే బ్రహ్మమైనవాడు తనలో తాను రమిస్తూ ఉంటాడు గాని, బ్రహ్మానందానుభూతి అవ్యక్తము.

గురుదక్షిణ : 
ఆత్మ జ్ఞానము పొందిన శిష్యుడు, తిరిగి ఇతరులకు ఉపదేశించుటయందు గురువుకు ఆ శిష్యునిపై సంతోషము కలిగిన యెడల అదే గురు దక్షిణ.

గురూపదేశమునకు అనర్హులు :

1.      సాంప్రదాయములను అంటిపెట్టుకొని, క్రొత్త విషయములను తెలుసుకొనుటకు ఇచ్ఛలేనివారు.
2.      రాగాదులలో చిక్కుపడినవారు.
3.      త్రికరణశుద్ధి లేనివారు.
4.      విద్యా అర్థియై తనంతట తాను గురువును సమీపించనివారు.
5.      ప్రయత్నము, పట్టుదల, ఆసక్తి లేనివారు
6.      అసూయాపరులు, కాపట్యులు, ఋజువర్తనము లేనివారు.
7.      ఆధ్యాత్మిక విషయములను నేర్చుకొనుట యందు ఇచ్ఛా ప్రయత్నములు, ఆతురత లేనివారు
8.      గురుబోధను ఊహాపోహల సాధనచేత పెంచుకొనలేనివారు.
9.      వినయ విధేయతలు, గురుభక్తి, శరణాగతి లేనివారు.

శిష్యుని యోగ్యత : 
గురువుపట్ల సేవా నిరతి, శరణాగతి, ఇష్టదైవ భక్తితో సమానమైన గురుభక్తి ఉండవలెను. శ్రద్ధతో వినుట, విన్న విషయములపై లగ్నత, ఏకాగ్రత, సమన్వయపరచుకొనుట, దక్షత, సాధనలందు పట్టుదల, తత్త్వ జిజ్ఞాస ఉండవలెను. స్వాభిమానము, నేను, నాది అనే మమత్వము లను అధిగమించి ఉండవలెను. అసూయ, ద్వేషము, మత్సరము వదలి యుండవలెను. ఇది ఇంతేకదా! అది అంతే కాదా! అనెడి తేలిక, నిర్లక్ష్య భావన వదలవలెను. అందరిపట్ల ఉదాసీనత కలిగి, సర్వ వ్యవహారములు, గుణములు అన్నీ నిశ్చలమైన, శాశ్వతమైన తనకు వచ్చిపోయేవేనని, వాసనాత్రయమును, ఈషణా త్రయమును జయించిన వాడై ఉండవలెను. చివరిగా సాధనా చతుష్టయ సంపత్తి కలిగి తీవ్ర ముముక్షువై యుండవలెను. గురువును ఆశ్రయించినవాడై, గుర్వాజ్ఞకు బద్ధుడై, ఎందుకు? ఏమి? అని సంశయము లేకుండా ఉండవలెను.

ముముక్షువులు తెలుసుకొనవలసినవి : 
(1) తానెవరు (2) ఫల స్వరూపము (3) సాధనచేత గాని, ఉపాయము చేత గాని, ఆ ఫల స్వరూపము నెరుగుట. ఈ మూడూ స్పష్టముగా తెలిసి యుండవలెను.

మనన సహాయత్రయము : 
(1) యుక్తి (2) తర్కము (3) అనుమాన ప్రమాణము- ఈ మూడింటి సహాయముతో మననము చేయుచు స్వస్వరూప నిర్ణయము చేసుకొనవలెను.

నిదిధ్యాస పంచకము : 
(1) మంత్ర యోగము (2) స్పర్శ యోగము (3) భావ యోగము (4) అభావ యోగము (5) మహా యోగము. ఈ ఐదు యోగములచే స్వస్వరూపమందు స్థిరపడుటయే నిది ధ్యాస పంచకము వలన ప్రయోజనము.

శ్రవణము  : 
వాసనా త్రయము, ఈషణాత్రయము వంటివి అడ్డురానీయక, గురు బోధను శ్రద్ధ, ఏకాగ్రతతో వినుట. తత్త్వమసి వాక్యార్థము బోధపడు వరకు మరల మరల వినుట, చదువుట, సహధ్యాయులతో చర్చించుకొనుట, సంశయములు తీర్చుకొనుట. ఇవన్నీ శ్రవణము క్రిందికి వచ్చును.

మననము : 
బోధపడిన విషయము స్వానుభవముగా, కరతలామలకముగా మారు వరకు చేయుచున్న అంతర్విచారణ. బ్రహ్మ బోధను తన గురించిన బోధగా సమన్వయపరచుకొనుచు బుద్ధిలో ధృడపడువరకు తనలోన సద్విమర్శ చేసుకొనుట మననబడును. బోధ ప్రబోధగా జీర్ణమగు వరకు ఈ మననము కొనసాగి, నిది ధ్యాసగా మారగానే మననము అప్రయత్నము గానే ఆగిపోవును.

నిదిధ్యాస : 
అధ్యవసానము, లేక నిశ్చయ జ్ఞానము. ఈ దశలో మననము దాని అంతట అదే ఆగిపోయి వాక్యార్థము రూఢియై, శిష్యుడు ఆరూఢుడగును. పర్యవసానముగా సాక్షాత్కార జ్ఞానమునకు సంసిద్ధుడగును.
         శ్రవణమనగా బ్రహ్మను అర్థము చేసుకొనుట. మననమనగా గోచరము కాని బ్రహ్మమును, గోచరమగుచున్న ప్రపంచమును వేరు వేరుగా చూడక ఈ ప్రపంచమును ఆ బ్రహ్మయొక్క విభూతియేనను భావము కలిగేదాకా చేసే అంతర్విచారణ. నిదిధ్యాసనమనగా, విభూతియైన ప్రపంచము ఆ బ్రహ్మముకంటె వేరు కాదని, ప్రపంచమును బ్రహ్మముగానే చూచుట, అనగా సర్వం ఖల్విదంబ్రహ్మ అన్నట్లు నిశ్చయ బుద్ధి కలుగుట.
         శ్రవణమునకు ఉపనిషత్తులు, మననమునకు బ్రహ్మ సూత్రములు, నిదిధ్యాసకు భగవద్గీత చక్కగా ఉపయోగపడుననని పెద్దల సూచన.

పాషండులు : 
దేనియందైనను చిక్కుపడి, విశదపరచుకొనుటకు ఇష్టపడని మూర్ఖత్వము, లేక తమోగుణులను పాషండులందురు. వీరిలో (1) యోగపాషండులు (2) కర్మ పాషండులు (3) జ్ఞాన పాషండులు (4) వైరాగ్య పాషండులు (5) మిథ్యా పాషండులు (6) మాయా పాషండులు.ఇంకను నాస్తికులు, వంచకులు, వేద బాహ్యులు, కాపట్యులు మొదలగువారి ఆయా సాధనలందు గాని, అనుభవమునందు గాని, స్వభావమందుగాని, చిక్కుకొని, ఆపైన ఉద్ధరింపబడుటకు ఇష్టపడనివారు ఉన్నారు.

బ్రహ్మ ఘాతకులు : 
పరబ్రహ్మ లేడు అని ఎవరు చెప్పెదరో, బ్రహ్మ స్వరూపమును శాస్త్రములో చెప్పినట్లు గాక మరో విధముగా ఎవరు నిరూపించుచుందురో, బ్రహ్మ - ఆత్మలతో ఎవరు విభేదించెదరో ఈ ముగ్గురూ బ్రహ్మ ఘాతకులు.

ధ్యానబంధువు : 
ఆధ్యాత్మిక శాస్త్రములను కేవలము జీవించుట కొఱకు చదివి, బాగుగా వ్యాఖ్యానము కూడా చేయుచు, కాని వాటిని తన విషయములో ఆచరణలో పెట్టనివాడు ధ్యానబంధువు.

అగస్త్యభ్రాత : 
విద్యావంతుడై కూడా తన పేరు ప్రతిష్ఠలను కోరక, అనామకునివలె ఉంటూ ఆధ్యాత్మిక విద్యను తన స్వానుభవమునకు తెచ్చుకొనువాడు. అగస్త్యముని సోదరుడు అట్టివాడు.

శక్తిపాతము : 
హస్తమస్తక స్పర్శ చేతను, కరుణా కటాక్ష వీక్షణము చేతను, సంకల్పము చేతను శిష్యునికి నిర్వికల్ప సమాధిని కలిగించే గురు సత్తాను శక్తిపాతము అందురు. కుండలినీయందు చక్రభేదన, గ్రంథిత్రయ భేదనల వలన పరమ శివునితోడి సమావేశపరచుట శక్తిపాత ఫలితము. జీవుడికి ఉపాధి సంగత్వమునుండి పరిత్యాగ బుద్ధి కలిగించి, శుద్ధ బ్రహ్మ రూపత్వమును సిద్ధింపజేయునది శక్తిపాతము.
          శిష్యునికి తన దేహమునందే పరమ శివుని సమావేశపరచువాడే నిజగురువు. గురువు శిష్యుని యొక్క సుషుమ్న ద్వారా అతడి హృదయము లోనికి ప్రవేశించి, సమాధిలోనున్న శిష్యుడి యొక్క నిశ్చేష్టితము నుండి నిర్వికల్పములోనికి మేల్కొల్పు ప్రక్రియ శక్తిపాతము. దీనివలన శిష్యుడు తాను జీవించినంత కాలము జీవన్ముక్తుడై యుండును. వేరే అనుభవములు కలిగించే శక్తిపాతములు శిష్యుని భ్రాంతిలోనికి నెట్టును. ప్రమాదములో పడవేయును. శిష్యుడు పిచ్చివాడగును, మోక్షమునకు దూరమగును.

నిజగురువు గొప్పతనము : 
మహత్తత్త్వమునుండి ముందుగా గురుతత్త్వము ఉత్పన్నమైనది. అదే మహతత్త్వము నుండి జీవేశ్వర జగత్తులు ఉత్పన్నమైనవి. తరువాత ఆవిర్భవించిన ప్రకృతి శక్తులకంటే ముందే ఉద్భవించిన గురుతత్త్వములోని శక్తి చాలా చాలా గొప్పది. యావత్తు ప్రకృతి శక్తులు, సృష్టి అంతా ఆ మహత్తైన గురువు ఆధీనములో ఉండును. మహత్తరమైన గురుశక్తి త్రిమూర్తులకంటే అధిష్ఠాన దేవతా శక్తులకంటే గొప్పది. గురువు యొక్క స్వశక్తియే సర్వశక్తులకు మూలాధారము. గురుతత్త్వము అయస్కాంతము వంటిది. అది అన్ని తత్త్వములను తనలోనికి ఆకర్షించుకొనియుండి, పరిపూర్ణమై యుండును. అదియే సాక్షాత్‌ బ్రహ్మతత్త్వము.
         ఈ గురుతత్త్వము శిష్యులలో ఎప్పుడు క్రియాశీలమగునో, అప్పుడు మాయావరణ తొలగి మాయాశక్తి అంతరించి శిష్యుడు పరబ్రహ్మగా ప్రత్యభిజ్ఞానమును పొందును.
         సద్గురువు శూన్య భాండమువలె మౌనముగా ఉండును. భక్తుడు చెంతకు రాగానే అతని రూపు గురువు యొక్క అంతరంగములో ప్రతిబింబించును. ఎవరూ సమీపించనప్పుడు, సంకల్పము చేతకూడా వెంబడించనప్పుడు గురుమూర్తి తటస్థముగా, లేనివాడుగా ఉండును. మౌనద్రష్ఠగా ఉండిపోవును. గురుమూర్తితో సంపర్కమైన వారిపట్ల తండ్రివలె ఉండి, జిజ్ఞాసులకు జ్ఞానోపదేశము చేయును. పిన్నలకు స్నేహాశీస్సు లందించును. తన్మయులైన శిష్యులను తిరిగి సామాన్యావస్థకు తీసుకొని వచ్చుటకు ఆప్యాయముగా స్పర్శనిచ్చును. అప్పుడా శిష్యుని మనస్సు శరీరము తేలికపడును. అతడి హృదయములో ఆనందము ఉప్పొంగును. శిష్యుడు నిశ్చలస్థితినొంది సహజమగు వరకు రక్షించుచుండును.
          నిజమునకు గురుమూర్తి నిష్క్రియుడు. మాయా శక్తి గురువుకు వశమై యుండి శిష్యులకు, భక్తులకు అవసరమైన బోధ, సూచన, స్పర్శ, శక్తిపాతములు గురువు తరఫున చేయుచుండును. దానినే గురుకరుణ అని శిష్యులు అనుకొందురు. శిష్యుడు గురువు యొక్క ప్రభా మండలములో ప్రవేశించినప్పుడు శిష్యుడు ఎల్లవేళలా గురు సత్తాతో ప్రభావితమై యుండును. శిష్యుడు ఆత్మార్పణ చేసుకొన్నచో గురు ప్రభామండలములో విలీనమగును. శిష్యుడు గురువు యొక్క ప్రేమ తత్త్వములో సంలీనమైతే మాయా ప్రభావము తగ్గిపోవును, శిష్యుడి చైతన్యము గురువు చైతన్యము ఏకీకృతమగును. శిష్యుని పూర్వభావములు ఊర్థ్వముఖమగును. శిష్యుడు  కేవలము శరణాగతుడై యుంటే భగవద్దర్శనము లభించును. శుద్ధ భక్తి మార్గములో ఉండే శిష్యుడికి స్వస్వరూప సాక్షాత్కారమగును.
          శ్రీ గురువు శరీరములోని చిదణువులన్నీ దివ్య శక్తితో స్పందించుచుండును. అందువలన గురువుయొక్క వాక్కు, స్పర్శ, సంకల్పము అన్నీ కూడా శిష్యుడికి ప్రయోజనకరముగా ఉండును. భక్తులపై చేసే శక్తి ప్రయోగము గురువు యొక్క లీలా విలాసము. గురువులో మమైకమయిన శిష్యుడు నిర్లిప్తుడగును. అతని బుద్ధి నిశ్చలత నొందును. గురు కృపవలన శిష్యుడికి అంతర్‌దృష్టి, ఆత్మ శక్తి లభించును. సత్యానుభవము పొందిన శిష్యుడికి మాత్రమే గురువు స్వభావము బాగుగా తెలియబడును.
         ఒక గురువుతో మరొక గురువు కలిసిన ఇద్దరూ ఒకే ప్రాణ మనస్సులను, ఒకే గుణమును కలిగి యుందురు. ఒకరినొకరు పూజించు కొందురు. వారి సంభాషణ మౌనములోనే జరిగిపోవును. ఇద్దరి ఆత్మలు ఒకే శివాత్మగా ఉండును. శిష్యుడు వేరొక గురువు చెంతకు వెళ్ళినప్పుడు ఆ గురువు శిష్యుడికి అతడి గురు రూపముగానే కనిపించును. గురువు శిష్యుడి హృదయ పీఠముపై ప్రతిష్ఠితుడైతే శిష్యుడు గురువు మాదిరిగా మారిపోవును. శిష్యుడు గురోన్ముఖుడైతే అతడిలో గురుసత్తా జేరి అతడిని ఊర్ధ్వ ముఖునిగా చేయును. గురు సత్తాకు లోబడి యున్న కొందరు శిష్యులు ఆ గురువు చేతిలో పనిముట్టుగా ఉందురు. గురువు అట్టి శిష్యుల ద్వారా తన కార్యక్రమమును నిర్వర్తించుచుండును.
         శిష్యుడి యొక్క బ్రహ్మ రంధ్రమును గురువు మూసివేసి, తన కార్యక్రమమును ఆ శిష్యుడి ద్వారా జరుపుకొనును. తగిన సమయములో శిష్యుడి బ్రహ్మరంధ్రము తెరచును. అప్పుడా శిష్యుడు స్వతంత్రుడై తాను కూడా ఒక గురుమూర్తియై తన గురు ఋణమును తీర్చుకొనును.

శిఖ్‌ : శిష్యుడు, శిఖ్‌మతమనగా శిష్య సంఘము యొక్క నియమములు అని అర్థము.

అమితాబ్‌ బుద్ధ : ప్రథమాత్మ, రక్షకుడు, అవతారుడు, సద్గురువు

యెహోవా : ఉన్నదున్నట్లున్నవాడు, శాశ్వతుడు

ఏసు : రక్షకుడు, అవతారుడు

క్రీస్తు : అభిషిక్తుడు, ఆత్మచైతన్యముతో అభిషిక్తమైయున్నవాడు

అల్లాహో అక్బర్‌ : భగవంతుడు సర్వోన్నతుడు

లాయిలాహ్‌ : అంతకంటే మించిన విశ్వ నియంత లేడు

ఇల్లల్లాహ్‌ : అతడే ఆరాధించ తగినవాడు

కుతుబ్‌ : సద్గురువు

రసూల్‌ : అవతారుడు

ఇస్లామ్‌ : శరణాగతి అని అర్థము

ఇమామ్‌ : విశ్వాసము అని అర్థము

ఇబాదత్‌ : 
(1) ఆరాధన, ఉపాసన (2) విధేయత, ఆజ్ఞాపాలన (3) దాస్యము, బానిసత్వము అని మూడు అర్థములు.

అహూర్‌ మజ్దా : అహూర్‌+మజ్డా = దేవుడు+జ్ఞానము అనగా జ్ఞానప్రకాశ రూపుడగు భగవంతుడు

మహమ్మద్‌ : దైవముచే స్తుతించబడినవాడు అనగా సద్గురువు లేక అవతారుడు.

షియాలు : 
మత స్థాపకుడైన మహమ్మద్‌ ప్రవక్త వంశీయులకే వారసత్వముగా ప్రవక్త పదవి చెందవలెనని తీర్మానించుకున్నవారు. స్వంతముగా ప్రార్థన చేయక, ప్రతినిధులచేత ప్రార్థన చేయించుకొనువారు. షియాలనగా విడిపోయినవారు అని అర్థము.

సున్నీలు : 
ముసల్మాన్‌ సమాజమునకు అధిపతిగా ఉండేవారు. ఎన్నిక ద్వారా నిర్ణయింపబడినవారు. స్వంతముగానే ప్రార్థన చేయువారు.

ఆఫా : 
జొరాస్టరు మతములో సేవ, త్యాగము, భక్తి అనే మూడింటికి సంబంధించిన త్రికరణ శుద్ధితో జరుపబడే నైతిక ప్రవర్తన. ఆఫా అనగా నైతిక ప్రవర్తన అని అర్థము.

సంబోధి : 
జ్ఞానలబ్ది పొంది, బుద్ధత్వముతో బుద్ధులైనవారు, అనగా ముక్తులు

హీనయానము : 
ఎవరిమటుకు వారు బోధి సత్వులై బోధ చేయగా బుద్ధులైనవారు. చరమదశలో ముక్తులు.

మహాయానము : 
సృష్టిలోని ప్రతి జీవి బుద్ధత్వము పొందేవరకు తమ బుద్ధత్వమును వాయిదా వేసుకొని బోధి సత్వులుగా మరలా మరలా జన్మించుచు, ఇతరులకు సహాయము చేయువారు

మహాయాన బుద్ధులు 3 రకములు :
1.        గురూపదేశము పొంది, సత్యమును దర్శించి, బుద్ధులైనవారు.
2.      గురువు లేకనే తమంతట తాము సత్యమును దర్శించి బుద్ధులైనవారు. వారి గురించి ఎవరికీ తెలియనీయరు.
3.      సత్యమును దర్శించి బుద్ధులైనవారు లోకమంతా ప్రచారము చేసేవారు. వీరు సమ్యక్‌ బుద్ధులు అని పిలువబడుతారు.

బోధి సత్వులు : 
బౌద్ధ సాధనలో దుఃఖ నివారణ మార్గములో సాధన చేయుచు ఆదర్శముగా నుండు వారిని బోధిసత్వులందురు.

ఇమ్మానుయేలు : దేవుడు మనకు తోడు అని అర్థము.

ఖలీపా : దైవ ప్రతినిధి.

సూఫీ గురువు : 
సూఫ్‌ అనగా ఊలు. సూఫీ గురువులు ఊలుతో తయారు చేసిన పొడవాటి గౌనులు ధరించేవారు. అందువలన వారి మతమును సూఫీమతమనియు, వారిని సూఫీగురువులని అందురు.

పితృ పంచకము : 
స్వపిత మొదటి గురువు, ఉపనయము చేసిన గురువు, విద్య నేర్పిన గురువు, అన్నదాత, భయమును పోగొట్టినవాడు. వీరు ఐదుగురిని పితృపంచకమని అందురు.

మానవుని భాగ్యము : 
1.తల్లి వాత్సల్యము 2. తండ్రి శాసనము 3. గురూపదేశము. ఈ మూడూ ఎవరికి లభించునో వారి  జీవితము పూర్ణము. వీటిలో ఏది లేకున్ననూ అతడి వ్యక్తిత్వములో దోషములుండవచ్చును.

సమర్థ సద్గురు సాయినాధుని గురువు
జర్‌ జారీజార్‌ బక్షి అనే పేరుతో 600 సంవత్సరముల క్రిందనే సద్గురువై సాయినాధుని అనుగ్రహించిరి. సాయినాధుడు 19వ శతాబ్దములో సద్గురువై 1918లో శరీర విసర్జన చేసిరి.

శ్రీరామానుజాచార్యుల గురు పరంపర : 
శ్రీమన్నారాయణ - శ్రీ మహాలక్ష్మీ - విష్వక్‌ సేనులు - శఠగోపాచార్య - శ్రీనాధముని - పుండరీకాక్ష - రామ మిశ్రులు-యమునాచార్య - శ్రీరామానుజాచార్య.

అన్వీక్షికీ కౌశలము : 
సకల దృశ్యములను అఖండాత్మగా దర్శించే నైపుణ్యమును అన్వీక్షికీ కౌశలమందురు.

వాక్యము - పదముల సమన్వయార్థము
ఒక పద సముదాయములో ఆకాంక్ష, సన్నిధి, యోగ్యత అని మూడు లక్షణములున్నప్పుడే వాక్యార్థము తెలిసి నిశ్చయ జ్ఞానము కలుగును. ఈ మూడు లక్షణములు లేని వాక్యము తగిన అనుభవము నీయజాలదు.

1. ఆకాంక్ష : 
పదముల యొక్క అర్థము సమన్వయము కావలెను. ఒక కిలో వస్త్రము, ఒక గజము బియ్యము అన్నప్పుడా పద సముదాయమందు ఆకాంక్ష లేదు. కిలో బియ్యము, ఒక గజము వస్త్రము అన్నప్పుడే ఆకాంక్ష ఉన్నది. అప్పుడే సమన్వయము కుదురును.

2. సన్నిధి : 
పదముల మధ్య విరామము, ఉచ్ఛారణలో ఆలస్యము జరిగినప్పుడు వాక్యార్థము మారిపోవును. పదముల మధ్య సాన్నిధ్య మున్నప్పుడు అర్థము చెడదు. అశ్వద్థామ హతః.. కుంజరః అన్నప్పుడు విరామము వలన అశ్వద్థామ అనే ద్రోణాచార్యుని పుత్రుడు చచ్చెనని అపార్థము వచ్చెను. కుంజరః అను పదము విరామము తరువాత వచ్చెను. అది సన్నిధిగా చెప్పినచో అశ్వద్థామ అనెడి ఏనుగు చచ్చెనని సరిగ్గా అర్థమయ్యెడిది. అనర్థము కాకపోయెడిది.

3. యోగ్యత : 
ప్రత్యక్ష ప్రమాణమునకు విరుద్ధము ఉండకూడదు. అగ్నితో తడుపుము అన్నప్పుడు రెండు పదములను కలిపి ఉచ్ఛరించుటలో యోగ్యత లోపించినది. ఆ వాక్యము ప్రమాణము కాదు. అగ్నితో కాల్చుము అని అన్నప్పుడు గాని, నీటితో తడుపుము అని అన్నప్పుడు గాని ఆ రెండేసి పదములకు యోగ్యత కుదిరి ప్రమాణము సిద్ధించుచున్నది.
         ఈ విధముగా వేదాంత వాక్యములను పరిశీలించలెను.

సద్గురువు - అంతర్యామి : 
సశరీరుడు, సర్వజ్ఞుడు అయినట్టి సద్గురువే అంతర్యామి. అవతార పురుషునిలో అంతర్యామిగా ఉండునది సద్గురు తత్త్వమే. అవతారుడు జరిపే అవతార కార్యక్రమమునకు అంతఃప్రేరణ నందించేది సద్గురువైన అంతర్యామి. అవతారుని శరీర విసర్జన జరిగిన తరువాత, అవతార చైతన్యము సద్గురుని ఇచ్ఛానుసారము ఫలితముల నిచ్చును. పరమాత్మలో, పరబ్రహ్మలో అంతర్యామి పాత్ర ఉండదు. శాస్త్రజ్ఞులలో, తత్త్వవేత్తలలో, వారు పరిశోధించే వాటికి, వారిలో అంతఃప్రేరణగా ఉండే తత్త్వము యొక్క కేంద్రము, ఆ కేంద్ర స్థితియే సద్గురు స్థితి లేక అంతర్యామిత్వము.

శ్లో||  న గురోరధికం తత్త్వం, న గురోరధికం పరం,
       తత్త్వ జ్ఞానాత్పరం నాస్తి, తస్మై శ్రీ గురవే నమః

||   బాలమత్తరీతి బలు పిశాచము భాతి |
       భావమందు భేదభావ మిడిచి |
       దిరుగుచుందురయ్య గురువులు ధరలోన |
       అఖిల జీవసంగ | ఆత్మ లింగ||

||   గురుదేవా! నీ కృపా వీక్షణ లేశమ్ము
       గూఢమౌ తత్త్వార్థ బోధకమ్ము
       ఋజుమార్గమును జూపు ఋషితుల్యుడవు నీవు |
          మార్గదర్శి మానవాళికెల్ల |
       దేశకాల వస్తు గుణ రూప జ్ఞానమ్ము |
       వాస్తవమున భావమాత్రమౌను |
       యతివరా! శాస్త్ర స్వరూపా ! నమస్సులివే |
       చిద్రూప చిన్మయానంద స్వామీ ||

శిష్యుని అనుభవము :

శ్లో||  అహం నిర్వికల్పో నిరాకార రూపః
       విభూత్వాచ్ఛ సర్వత్ర సర్వేంద్రియాణాం |
       నచాసంగతంనైవ ముక్తిర్నమేయః
       చిదానంద రూపః శివో-హం శివో-హం ||